భారత్ విశ్వగురు దిశగా ప్రయాణిస్తోంది. రానున్న కాలంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవనుంది. పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. తాజాగా, ది సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్(సీఈబీఆర్) ఇదే విషయాన్ని వెల్లడించింది. 2030నాటికి ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ప్రస్తుతం భారత్ ఏడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో ప్రాన్స్ ను వెనక్కి నెట్టి ఆరోస్థానాన్ని చేరుకోనుంది. 2023నాటికి బ్రిటన్ ను దాటుకొని ఐదో స్థానాన్ని ఆక్రమించనుందని ఈ కన్సల్టెన్సీ తెలిపింది. భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని స్పష్టం చేసింది. కరోనా సంక్షోభం నుంచి అనతికాలంలోనే బయటపడిందని పేర్కొంది. కరోనా మరణాల రేటు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని తెలిపింది. 2020లో జీడీపీ 7.3 శాతం క్షీణతను నమోదు చేసినా, 2021లో 8.5 శాతం వృద్ధి చెందే అవకాశం కనిపిస్తోందని జోష్యం చెప్పింది.
అటు కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో ఓ మైలురాయిని దాటనుంది. తొలిసారిగా 100 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరొచ్చని సీఈబీఆర్ అభిప్రాయపడింది. కరోనా పరిణామాల నుంచి క్రమంగా అంతర్జాతీయ జీడీపీ కోలుకోవడం ఇందుకు కారణమని తెలిపింది. అయితే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోల్బణం దిశగా ప్రయాణిస్తున్నాయని.. దాని నుంచి కోలుకోవడానికి ఆయా దేశాలు ఏ చర్యలు తీసుకుంటాయనేదే ముఖ్యమని సీఈబీఆర్ డిప్యూటీ ఛైర్మన్ డగ్లాస్ మెక్ విలియమ్స్ పేర్కొన్నారు. సరైన చర్యలు తీసుకోకపోతే.. 2023/2024లో ఆర్థిక మాంద్యం ఉండొచ్చని హెచ్చరించారు. 2030 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు.