దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ఉరిశిక్షలు పడ్డాయి. కొన్ని అమలయ్యాయి. మరికొన్ని జీవిత ఖైదుగా మార్చబడ్డాయి. కానీ ఇప్పటి వరకు మహిళకు ఉరిశిక్ష అమలు కాలేదు. కానీ తొలిసారిగా ఓ మహిళకు ఉరిశిక్ష అమలు కానుంది.
షబ్నం అనే ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతి ఉన్నత చదువులు చదివింది. ఇంగ్లీష్, జాగ్రఫీలో ఎం.ఏ పూర్తి చేసి స్వగ్రామంలోని ప్రైమెరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. తన ఇంటి సమీపంలో ఉండే సలీంను పెళ్లిచేసుకోవాలనుకుంది. కానీ తనకు చదువులేకపోవటంతో కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తన సొంత కుటుంబంపైనే పగ పెంచుకుంది. 2008 సంవత్సరంలో పాలలో మత్తు మందు కలిపి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చింది. వారందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడు సలీం ని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరు కలిసి కుటుంబ సభ్యులను హత్య చేశారు. తల్లి, తండ్రి, ఇద్దరు అన్నలు, వారి భార్యలు, పిల్లలు మొత్తం అందరిని చంపేశారు. తన అన్న కుమారుడు, పది నెలల వయసున్న బాబును కూడా షబ్నం చంపేసింది. అమ్రోహ జిల్లా కోర్టు లో ఈ కేసు రెండేళ్ల పాటు నడిచింది. తర్వాత అలహాబాద్ హైకోర్టుకు కేసు చేరుకుంది. అన్ని కోర్టు ల్లోనూ ఉరిశిక్ష పడింది. 2015లో సుప్రీంకోర్టు కూడా ఉరిశిక్ష వేసింది.
చాలా కేసుల్లో మహిళలకు ఉరిశిక్ష పడినా… రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టారు. కానీ షబ్నంకు మాత్రం రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. దీంతో డెత్ వారెంట్ ఇష్యూ కాగానే… ఉరితీయబోతున్నారు.
కానీ ఖైదీలను ఉరితీయటానికి అన్ని జైళ్ళలో వసతులు ఉండవు. పైగా మహిళను ఉరితీసే సౌకర్యాలున్న జైళ్లు చాలా తక్కువ. డెత్ వారెంట్ వచ్చాక మధుర జిల్లాలో ఆమెను ఉరితీసే అవకాశం ఉంది.