అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో కివీస్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత మహిళల జట్ట 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడింది. న్యూజిలాండ్ జట్టు విసిరిన 110 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 14.2 ఓవర్లలో ఛేదించగలిగింది. షఫాలీ వర్మ కేవలం 10 పరుగులు చేసి నిరాశ పరిచారు.
మరో ఓపెనర్ శ్వేత చివరి వరకు ఉండి జట్టును ఫైనల్లో నిలబెట్టింది. భారత జట్టులో శ్వేత షెరావత్ (45 బంతుల్లో 61 నాటౌట్; 10 ఫోర్లు) చెలరేగి ఆడారు. మరో బ్యాటర్ సౌమ్య తివారి (22) రాణించింది. న్యూజిలాండ్ బౌలర్లలో అన్నా బ్రౌనింగ్ 2 వికెట్లు పడగొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (32 బంతుల్లో 2 ఫోర్లు) 35 పరుగులు చేసింది. ఇసబెల్ల గేజ్(22 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది.
వీరిద్దరూ మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో షఫాలీ వర్మ 4 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసింది. పర్షవి చోప్రా 3 వికెట్లతో న్యూజిలాండ్ జట్టు వెన్ను విరిచింది.