స్వదేశీ గడ్డపై సఫారీలతో జరుగుతున్న మూడు టీ-20ల సిరీస్ లో దుమ్మురేపుతోంది టీమిండియా. రెండో మ్యాచ్ ను కైవసం చేసుకుని సిరీస్ సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. చెలరేగిపోయింది. సపారీ బౌలర్ల తడబాటును పూర్తిగా ఉపయోగించుకుని బౌండరీలు బాదారు.
రోహిత్ శర్మ(43), కేఎల్ రాహుల్(57) అదిరిపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(61) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కోహ్లీ(49 నాటౌట్) కూడా రాణించాడు. సూర్య అవుటైన తర్వాత వచ్చిన డీకే 7 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
238 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగారు సఫారీలు. ఆదిలోనే బవుమా(0) డకౌట్ అయ్యాడు. కానీ, డికాక్(69 నాటౌట్) నిలబడ్డాడు. రిలీ(0), ఎయిడెన్(33) తక్కువ పరుగులకే ఔట్ కాగా.. డేవిడ్ మిల్లర్(106 నాటౌట్) సిక్సులు, ఫోర్లతో బాదేశాడు. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో డికాక్, మిల్లర్ మ్యాచ్ ను తిప్పేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అది జరగలేదు. లాస్ట్ ఓవర్ కి 37 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే, అక్షర్ పటేల్ మూడు సిక్సులు ఇచ్చినా.. మిగిలిన మూడు బాల్స్ కి పెద్దగా పరుగులు ఇవ్వలేదు. దీంతో భారత్ విజయతీరాలకు చేరింది. సిరీస్ మన సొంతమైంది. మూడో టీ-20 మ్యాచ్ 4న జరుగుతుంది.
ఇక మ్యాచ్ మధ్యలో రెండుసార్లు అంతరాయం ఏర్పడింది. సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఫ్లడ్ లైట్స్ టవర్ పూర్తిగా ఆగిపోయింది. దీంతో అది సరి చేసే వరకు మ్యాచ్ ఆగిపోయింది. అంతకుముందు భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా మ్యాచ్ కు ఒకసారి అంతరాయం కలిగింది. మైదానంలోకి ఒక పాము రావడంతో ఆటను నిలిపివేశారు.