అండర్ – 19 ప్రపంచకప్‌లో యువఆటగాళ్లు సత్తాచాటారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలిమ్యాచ్ లో 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 46.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. చేజింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మన బౌలర్ల వేగం ముందు నిలబడలేకపోయారు. 45.4 ఓవర్లకి 188 పరుగులు చేసి దక్షిణాప్రికా ఆటగాళ్లు ఆలౌట్ అయ్యారు.
కెప్టెన్ యశ్ ధుల్ బ్యాట్ కి పని చెప్పగా.. విక్కీ ఓస్వాల్, రాజ్ భవా తమ బౌలింగ్ తో మ్యాజిక్ చేశారు. దీంతో విజయం భారత్ సొంతం అయింది. యశ్ ధుల్ 82 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. విక్కీ తన స్పిన్ మాయాజాలంతో ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ రాజ్ కూడా తల బౌలింగ్ వేగంతో సఫారీ జుట్టుకి చెమటలు పట్టించి నాలుగు వికెట్లు తీశాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ యువఆటగాళ్లు ఆరంభంలోనే ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. 11 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో తరువాత వచ్చిన వారిపై తీవ్ర ఒత్తిడిపడింది. అయితే, కెప్టెన్ యశ్ తనదైన శైలిలో బ్యాట్ కి పని చెప్పి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించి 82 రన్స్ చేశాడు. యశ్ కి రషీద్ (31) కూడా తోడవ్వడంతో తరువాత వచ్చినవారి పై ఒత్తిడి తగ్గింది. వీరితో పాటు నిశాంత్ సింధు(27), రాజ్ బావా(13) పరుగులు, కౌశల్ తాంబే(35) రాణించడంతో భారత్ 232 పరుగులు చేసింది. అయితే.. 46.5 ఓవర్ల దగ్గర భారత్ టీం ఆలౌట్ అయింది.
233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఫస్ట్ ఓవర్ లోనే భారత్ షాకిచ్చింది. నాలుగో బంతికే జాన్ కన్నింగ్‌హమ్‌ను రాజ్‌వర్ధన్ హంగర్‌గెకర్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆతర్వాత భారత బౌలర్లు విక్కీ, భవా వరుస వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికా జట్టును ఉక్కిరిబిక్కిరి చేశారు. వారి ధాటికి 45.4 ఓవర్లలో 187 పరుగులకే సఫారీ జట్టు ఆలౌటైంది.