ప్రపంచ క్రికెట్ లో ఇండియా అమ్మాయిలు సత్తా చాటారు. భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపి చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ గెలవడం ద్వారా మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయం లిఖించారు. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఆదివారం పోచెఫ్ స్ట్రూమ్ లో ఇంగ్లండ్ పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. కెప్టెన్ షెఫాలీ వర్మ 15, మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ 5 పరుగులు చేశారు. ఆ తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిష 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యాతివారి 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హన్నా బేకర్, సోఫియా, అలెక్సా ఒక్కో వికెట్ తీసుకున్నారు.
అయతే తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులు చేసి ఆలౌట్ అయింది. రియానా 19, అలెక్సా స్టోన్ హౌస్ 11, సోఫియా స్మేల్ 11, నిమా హోలాండ్ 10 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో తితాస్ సాధు, అర్చనా దేవి, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు. మన్నత్ కశ్యప్, కెప్టెన్ షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.