టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. భజ్జీ నిర్ణయంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా తనకు వచ్చే జీతాన్ని రైతుల పిల్లల విద్యాభ్యాసం, వారి సంక్షేమం కోసం వినియోగించనున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. దేశాభివృద్ధి కోసం తాను చేయగలిగినంత పనిని తప్పకుండా చేస్తానని ట్వీట్ లో వెల్లడించారు.
హర్భజన్ సింగ్ గతేడాది డిసెంబర్ 24న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత సిద్ధూ వెంట ఆయన కనిపించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వినిపించాయి.
కానీ ఆశ్చర్యకరంగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన్ని పంజాబ్ నుంచి రాజ్యసభకు ఆప్ పంపింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.