కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం భారతీయుడు 2. హేమాహేమీల కలయికలో భారతీయుడుకు సీక్వెల్ గా సినిమా వస్తుండటంతో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా ప్రారంభం నుండే సినిమాకు అనేక చిక్కులు ఏర్పడ్డాయి. బడ్జెట్ సమస్యతో సినిమా షూట్ మధ్యలోనే ఆగిపోయింది.
దీంతో అసలు ఈ సినిమా మళ్లీ మొదలవుతుందా? మొదలైనా శంకర్ దర్శకుడిగా ఉంటాడా? అనే అనుమానాలు తలెత్తాయి. కమల్ కూడా ఈ మూవీని పక్కన పెట్టి విక్రమ్ మూవీపై ఫోకస్ చేయటంతో సినిమా ఇంక అంతే అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయుడు-2 మళ్లీ పట్టాలెక్కనుంది. జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈలోపు కమల్ విక్రమ్ ను పూర్తి చేయనున్నాడు.
డైరెక్టర్ శంకర్ ఇప్పటికే షూటింగ్ ఏర్పాట్లలో నిమగ్నం అయ్యాడని తెలుస్తోంది. బడ్జెట్ విషయంలో శంకర్, లైకా ప్రొడక్షన్ ఓ అవగాహనకు వచ్చారని, అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమాని పూర్తి చేస్తానని శంకర్ నిర్మాతలకు హామీ ఇచ్చాడని, కమల్ హాసన్ కూడా కీలకమైన సమయంలో శంకర్‌కి మద్దతుగా నిలిచాడని తెలుస్తోంది. భారతీయుడు-2 తనకు పొలిటికల్ గా ప్లస్ అవుతుందని కమల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.