శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేసిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 1996లో వచ్చిన భారతీయుడు. లంచగొండులకు చెంపపెట్టులాంటి ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో తీయడంతో ప్రేక్షకులకి బాగా ఎక్కేసి.. అప్పట్లో ఓ ప్రభంజనం సృష్టించింది. ఊర్మిళ మటోండ్కర్, మనీషా కోయిరాలా అందచందాలు, కావలసినంత రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, అన్నింటికీ మించి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం ఆ సినిమాను ఆలిండియా ఆదరించేలా చేసింది.
ఇప్పడీ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ ఇండియన్-2 తీస్తున్నాడని ఎప్పుడో ఓ ప్రకటన వచ్చినా ఇంతవరకూ షూటింగ్ దశకు రాలేదు. ఇండియన్-2 కేవలం ఒక వదంతి అని.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు కూడా వినవచ్చాయి. తమిళనాడులో భారీ సినిమాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిపై ఒక క్లారిటీ ఇచ్చింది. తమ చిత్రం ఆగిపోయినట్టు వస్తున్న గాసిప్స్ నమ్మద్దని, ఇండియన్ -2 చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.
అన్నట్టుగానే శంకర్ ఈ సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు కూడా. ప్రస్తుతం రకుల్ ప్రీత్, సిద్దార్థ్ అండ్ ప్రియా భవానీలపై శంకర్ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇండియన్-2లో కమల్‌హాసన్ సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రస్తుతం కమల్ బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. త్వరలో కమల్ కూడా షూట్‌లో పాల్గొనబోతున్నాడని సమాచారం.
అంతా ఓకే కానీ, ఇప్పుడు శంకర్ కొత్తగా ఏ మెసేజ్‌తో రాబోతున్నాడనేదే అందరికీ కుతూహలంగా ఉంది. శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ ఓసారి గమనిస్తే ఏదో ఒక బర్నింగ్ ప్రాబ్లమ్ తీసుకుని, దాని చుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్ అల్లుకుంటూ కథ తయారు చేసుకోవడం అతని స్టైల్. ఇండియన్ అలానే అవినీతి.. లంచగొండితనం చుట్టూ అల్లిన కథ. ఇప్పుడూ ఇండియన్-2 కథను ఢిల్లీ నగరంలో జరిగిన నిర్భయ ఉదంతంతో పాటు మరికొన్ని అత్యాచార సంఘటనల ఆధారంగా అల్లినట్టుగా తెలుస్తోంది. ఈసారి శంకర్ ఇండియన్-2ని ఏవిధంగా తీర్చిదిద్దుతాడో.. ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో… చూద్దాం మరి!