ఎప్పుడూ భారత్ పై ఏడుస్తూ ఉండే పాకిస్తాన్.. ఏదో ఒకలా మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తూనే ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు అధికారులను అమ్మాయిలతో ట్రాప్ చేస్తోంది పాక్. అప్పుడప్పుడు హనీ ట్రాప్ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా గూఢచర్యం ఆరోపణలతో వైమానిక దళ అధికారి దేవేంద్ర శర్మను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు.
సోషల్ మీడియా ద్వారా దేవేంద్రను పాక్ యువతి హనీ ట్రాప్ చేసినట్లు భావిస్తున్నారు. ఈయన ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్ పోర్టులో పని చేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నాయి.
సదరు యువతికి శర్మ కీలక సమాచారం ఇచ్చాడని అనుకుంటున్నారు పోలీసులు. దీనిపై విచారణను ప్రారంభించారు. దేవేంద్రను సర్వీస్ నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఈ హనీ ట్రాప్ వెనుక పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు.
శర్మపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయన తప్పు చేసినట్టు నిర్ధారణ అయితే కనిష్టంగా మూడేళ్లు.. గరిష్టంగా జీవితఖైదు విధిస్తారు. ఉద్దేశపూర్వకంగా ఈ నేరం చేయకపోయినా శిక్ష తప్పదని చెబుతున్నారు అధికారులు. దేవేంద్రకు ఫేస్ బుక్ లో పరిచయం అయిన యువతి.. వాయుసేనకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు చూసింది. అలాగే శర్మ భార్య బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా చెబుతున్నారు.