అమెరికా వైమానిక విభాగంలో ఇండియన్ అమెరికన్ రవి చౌదరిని అత్యున్నత పదవి వరించింది. పెంటగాన్ లో టాప్ సివిలియన్ పోస్ట్ అయిన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అసిస్టెంట్ సెక్రటరీ పదవిలో ఆయన నియమితులయ్యారు. అమెరికా సెనేట్ లో ఓటింగ్ జరగగా ఆయనకు అనుకూలంగా 65 మంది సభ్యులు ఓటు చేశారు. 29 మంది వ్యతిరేకించారు. విపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా డజనుమందికి పైగా సభ్యులు ఆయన నియామకాన్ని సమర్థిస్తూ ఓటు వేశారు.
దీంతో సెనేట్ ఆయన అపాయింట్మెంట్ ని ధృవీకరించింది. రవి చౌదరి ఇటీవలి వరకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించారు. 1993 నుంచి 2015 వరకు ఆయన అమెరికా ఎయిర్ ఫోర్స్ లో అనేక ఆపరేషనల్, ఇంజనీరింగ్, సీనియర్ స్టాఫ్ అసైన్ మెంట్స్ వంటి పదవులు నిర్వహించారు.
గ్లోబల్ ఫ్లైట్ ఆపరేషన్లకు సంబంధించి , ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాల్లో కోంబాట్ మిషన్స్ లో పాల్గొనడమే గాక.. స్పేస్ లాంచ్ ఆపరేషన్ల లోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు.
నాసా గ్రాడ్యుయేట్ గా సెయింట్ మేరీ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ విభాగంలో రాణించడమే గాక.. యుఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టాను సాధించారు. ఇండియన్ అమెరికన్ల ప్రతిభను గుర్తించిన అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం వారిని అనేక ఉన్నత పదవుల్లో నియమిస్తోంది.