ఏదేశమేగినా భారతీయత తన సత్తా చాటుతూనే ఉంది. మేధస్సుకు ఆకాశమే హద్దు.. మరో ప్రపంచ దిగ్గజ సంస్థకు సీఈఓగా భారత సంతతికి చెందిన వ్యక్తి అయ్యాడంటే అది కోట్లాది భారతీయులకు గర్వకారణమేనని అంటున్నారు. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న యూట్యూబ్ కి సరికొత్త సారధిగా నీల్ మోహన్ నియమితులయ్యారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలెక్ట్రిక్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన 2008 లో గూగుల్ లో చేరారు. 2015 లో యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించి యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం, షార్ట్స్ తో సహా పలు భారీ ‘ప్రాడక్టులను’ లాంచ్ చేశారు.
మైక్రోసాప్ట్ తో కూడా కలిసి పని చేసి స్టిచ్ ఫిక్స్ అండ్ జీనోమిక్స్ అండ్ బయోటెక్నాలజీ కంపెనీలోనూ తన ప్రతిభను చూపారు. 2007 లో గూగుల్ స్వాధీనం చేసుకున్న ‘డబుల్ క్లిక్’ కంపెనీలో సుమారు ఆరేళ్ళు పని చేశారు. నాడు ఈ సంస్థలో నీల్ మోహన్… డిస్ ప్లే అండ్ వీడియో అడ్వర్టైజింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ప్రపంచంలోనే అత్యంత పెద్దవైన కొన్ని టెక్ జెయింట్ల ‘సమూహానికి’ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ల క్లబ్ లో ఆయన కూడా ఒకరు కానున్నారు.
తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈఓగా ఉన్న సుసాన్ వొజిసికి రాజీనామా చేయడంతో నీల్ మోహన్ ని ఈ పదవి వరించింది. మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ లో ఈమె సుమారు పాతికేళ్లుగా పలు పదవులు నిర్వహించారు. యూట్యూబ్ సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్న సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో ఆమె.. కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్యం, వ్యక్తిగత ప్రాజెక్టులపై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. కొత్త ప్రయాణం పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నానని వొజిసికి పేర్కొన్నారు.
ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల్లో భారతీయుల హవా కొనసాగడం విశేషం. ఇప్పటికే గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సారథిగా శంతను నారాయణ్ తదితరులు వ్యవహరిస్తున్నారు. ఇక నీల్ మోహన్ కు సుందర్ పిచాయ్ కంగ్రాట్స్ చెప్పారు. సుసాన్ సేవలను పొగుడుతూనే ఓ అసాధారణ టీమ్ ను సిద్ధం చేశారన్నారు. యూట్యూబ్ ను నీల్ మోహన్ విజయవంతంగా ముందుకు నడిపించగలరన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.