అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా తాను కూడా అమెరికా అధ్యక్ష బరిలో నిలవనున్నట్టు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హింట్ ఇచ్చారు. త్వరలోనే పోటీపై ఓ ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు.
అధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు రెండు విషయాలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొదటిది దేశానికి కొత్త నాయకత్వం అవసరమా? అనే విషయం, రెండోది ఆ కొత్త నేత తానేనా అనేది ఆలోచించాలన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టలేరన్నారు.
దేశాన్ని కొత్త దిశలో తీసుకు వెళ్లే సత్తా తనకు ఉందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను సౌత్ కరోలినా గవర్నర్‌గా, అంబాసిడర్‌గా చాలా సమర్థవంతంగా పని చేశానని చెప్పారు. ముఖ్యంగా రెండంకెల నిరుద్యోగంతో బాధపడుతున్న రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకు వచ్చానన్నారు.
తాను ఎన్నడూ ఏ పోటీలో ఓడిపోలేదని ఆమె పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో కూడా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. అయితే పోటీలో తాను జో బిడెన్ కు వ్యతిరేకంగా బరిలో దిగాల్సి వుంటుందన్నారు. ఆయన్ని రెండో సారి అధ్యక్షునిగా ఎన్నుకోలేమన్నారు. అందుకే తాను దానిపై దృష్టి పెడుతున్నానన్నారు.