ఏ దేశమేగినా భారత మేధస్సు పరిమళిస్తూనే ఉంటుందనడానికి భారత సంతతికి చెందిన ఇండో-అమెరికన్ మహిళ అప్సరా అయ్యరే సాక్ష్యం. ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఈమె.. ఈ సంస్థ 136 సంవత్సరాల చరిత్రలో ఈ పదవిని పొందిన తొలి భారత సంతతి మహిళగా రికార్డులకెక్కారు. తమ సంస్థ 137 వ ప్రెసిడెంట్ గా అప్సర ఎన్నికైనట్టు హార్వర్డ్ క్రిమ్ సన్ ఓ రిపోర్టులో తెలిపింది. 1887 లో ఏర్పాటైన హార్వర్డ్ లా స్కూల్.. కు అమెరికాతో బాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.
1887 లో నాటి ఫ్యూచర్ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లూయిస్ డీ బ్రాండీస్ దీన్ని స్థాపించారు. ప్రపంచంలోని మరే ఇతర లా జర్నల్ లోనూ లేనంత విస్తృత సర్క్యులేషన్ తో ఈ సంస్థ పూర్తిగా విద్యార్థుల సంపాదకీయంలో నడుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ జర్నల్ తొలి నల్లజాతి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ సంస్థలో ఆర్ట్ క్రైమ్ పై పరిశోధనలు చేసిన అప్సరా అయ్యర్.. 1100 కి పైగా కళాఖండాలను స్వదేశానికి తరలించడానికి అంతర్జాతీయ, ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో అవగాహన కుదుర్చుకున్నారు. ఈ కళాఖండాలన్నీ 15 (వివిధ) దేశాలకు చెందినవి.
ఆర్ట్ క్రైమ్ పై రీసెర్చ్ పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఈమె.. 2016 లో యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, మ్యాథ్స్, స్పానిష్ లలో బీఏ పట్టా అందుకున్నారు. క్లారెండన్ స్కాలర్ గా ఆక్స్ ఫర్డ్ లో ఎంఫిల్ చేశారు. 2018 లో మన్ హటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ యాంటిక్విటీస్ ట్రాఫికింగ్ యూనిట్ లో చేరి ఆర్ట్ క్రైమ్ మీద పలు పరిశోధనలు చేశారు.
2020 చివరిలో హార్వర్డ్ లా స్కూల్ లో చేరి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ క్లినిక్ లో స్టడీ చేసిన స్టూడెంట్ అయ్యారు. ప్రాచీన ప్రాధాన్యం గల పురాతన వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 2021-22 లో నడుం కట్టిన అప్సర.. హార్వర్డ్ లా స్కూల్ ను వీడి డీఏ కార్యాలయానికి తిరిగి వచ్చారు. ఇక్కడే అప్సర డిప్యూటీ స్థాయికి చేరుకున్నారు. తనకు ముందు హార్వర్డ్ లా స్కూల్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రిసిల్లాస్ తనకు ప్రేరణ అంటున్నారు ఈమె. తన నియామకంపై ఓ స్టేట్మెంట్ ఇచ్చిన ఈమె.. ఇది తనకెంతో గౌరవప్రదమైన బాధ్యతగా అభివర్ణించారు.