కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలలో భారత సైన్యం కూడా పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం పిలుపునకు ఐటీబీపీ మద్దతు ప్రకటించింది. సుమారు 12వేల అడుగుల ఎత్తులో మువ్వన్నెల భారతీయ జెండాను తిరంగా జెండాను రెపరెపలాడిస్తూ ఐటీబీపీ బృందం దేశభక్తిని చాటుకుంది.
ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. ఆగష్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్ల మీద జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చింది. భారత్ కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్రం ఈ ఉత్సవాలు ప్రారంభించింది.
అందులో భాగంగా.. ఆగస్టు 13,14,15 తేదీలలో అంటే మూడు రోజుల పాటు 20 కోట్ల మంది తమ ఇళ్ల మీద జాతీయ పతకాన్ని ఎగరేయాలని నిర్ణయించింది.
ఈ మహోజ్వల ఘట్టం కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని.. మన స్వాతంత్ర్య సమరయోధులపై గౌరవ, మర్యాదలు పెంచేందుకు, మరెంతో మంది భారతీయుల్లో ఈ కార్యక్రమం స్ఫూర్తిని నింపుతుందని కేంద్రం భావిస్తోంది.