భారత ఆయుధ అమ్ముల పొదిలో దేశీయంగా రూపొందించిన అనేక ఆయుధాలు చేరుతున్నాయి. ‘ఎక్సర్ సైజ్ తొప్చి-2023’ పేరిట మహారాష్ట్ర లోని దేవ్ లాలీ ఫైరింగ్ రేంజ్ లో ఆదివారం నిర్వహించిన ప్రదర్శనలో భారత ఆయుధ సత్తా నిరూపితమైంది. ఆర్టిల్లరీ గన్స్, రాకెట్ సిస్టమ్స్, సెల్ఫ్ ప్రొపెల్ద్ కె 9 వజ్ర టీ గన్స్, ఎం 77 అల్ట్రా లైట్ హొవిట్జర్స్, అప్ గ్రేడ్ చేసిన శరంగ్ గన్స్, పినాక రాకెట్ సిస్టమ్స్.. 105 ఎంఎం /37 క్యాలిబర్ ఇండియన్ ఫీల్డ్ గన్స్.. ఇలా ఎన్నింటినో ప్రదర్శించారు.
ఈ బ్లాక్ బస్టర్ ఆర్మ్స్ డెమాన్స్ట్రేషన్ ఆయుధాల తయారీలో మన దేశీయ స్వావలంబనను నిరూపించిందని, ఇదే సమయంలో చైనాను హెచ్చరించేందుకు కూడా ఇది ఉద్దేశించినదని లెఫ్టినెంట్ జనరల్ ఎస్. హరిమోహన్ అయ్యర్ తెలిపారు. ఈయన దేవ్ లాలీ లోని స్కూల్ ఆఫ్ ఆర్టిల్లరీ కమాండెంట్ కూడా.. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత ‘నినాదం’ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నదని, ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ ప్రదర్శనలో కాలం చెల్లిన బోఫోర్స్ వంటి శతఘ్నుల స్థానే సరికొత్త శతఘ్నులతో బాటు రష్యన్ ఆరిజిన్ గ్రేడ్ బీ 21 మల్టీ బ్యారెల్ రాకెట్ సిస్టమ్స్, వెపన్ లొకేటింగ్ రాడార్స్, మోర్టార్స్, హెలికాఫ్టర్స్ వంటి అనేక అధునాతన ఆయుధ వ్యవస్థలను కూడా చూపారు. వీటిలో ధనుష్ ‘టోడ్’ ఆర్టిల్లరీ గన్స్ ను 2017 లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించారు. జబల్పూర్ లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీలో రూ. 14.50 కోట్ల వ్యయంతో ఒక్కో ఆర్టిల్లరీ గన్ తయారైంది.
లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా చొరబాట్లను ఎదుర్కోవడానికి ఈ ఆయుధ వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉంటాయని హరిమోహన్ అయ్యర్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో ఎత్తయిన పర్వత శిఖరాలపై అత్యాధునిక కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని, వీటివల్ల శత్రు బలగాల కదలికలను ఎప్పటికప్పుడు గమనించవచ్చునని ఆయన చెప్పారు.