ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి జపాన్ లోని యొకోహామా తీరంలో నిలిపివేసిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ సిబ్బంది, ప్రయాణీకుల్లో ఆందోళన మొదలైంది. 160 మంది ఇండియన్ సిబ్బంది, 3,700 మంది ప్రయాణీకులతో కూడిన క్రూయిజ్ ను వైరస్ భయంతో తీర ప్రాంతంలోనే నిలిపివేసి ఎవరినీ బయటకు రాకుండా చేశారు. దీంతో లోపల ఉన్న వారిలో ఆందోళన రోజు రోజుకు తీవ్రమౌతోంది. క్రూయిజ్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున తమను కాపాడాలంటూ బినయ్ కుమార్ సర్కార్ అనే నార్త్ బెంగాల్ చెప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఙప్తి చేశారు. క్రూయిజ్ లోని మిగతా వారితో తమను వేరు చేయాలంటూ ప్రధానమంత్రికి, ఐక్యరాజ్య సమితి కి వీడియో మెస్సేజ్ పోస్ట్ చేశారు. మాకెవరికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించలేదని చెప్పారు.వీడియోలో బినయ్ కుమార్ తో పాటు మరో ఐదుగురున్నారు. అందరూ వైట్ మాస్క్ లు ధరించి ఉన్నారు.
”దయచేసి ఎలాగైనా మమ్మల్ని సాధ్యమైనంత త్వరగా కాపాడండి…మాకేమైనా జరిగితే ఏంటి పరిస్థితి…భారత ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాను…మోదీ జీ, ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి వేరు చేసి క్షేమంగా ఇంటికి తీసుకెళ్లండి” అంటూ అభ్యర్ధించాడు.
డైమాండ్ ప్రిన్సెస్ ఎక్స్ ప్రెస్ లగ్జరీ క్రూయిజ్ జనవరి 20 వ తేదీని బయలు దేరింది. జనవరి 25న హాంగ్ కాంగ్ లో ఓ ప్రయాణీకుడు దిగిపోయాడు. ఫిబ్రవరి 2 న హాంగ్ కాంగ్ పాసింజర్ కు కరోనా వైరస్ ఉన్నట్టు చెప్పారు. మొత్తం 3,700 మంది ప్రయాణీకుల్లో 356 మందిలో మాత్రమే వైరస్ లక్షణాలు కనిపించినట్టు తెలిసింది. అయినప్పటికీ ఫిబ్రవరి 19 వరకు క్రూయిజ్ ను తీర ప్రాంతంలోనే ఉంచాలని ఆదేశించారు. తాజాగా సోమవారం నాడు 60 మంది కొత్త వారిలో వైరస్ లక్షణాలు కనిపించినట్టు జపాన్ అధికార వర్గాల తెలిపాయి. ఇప్పటి వరకు వైరస్ పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 130 కి చేరింది. షిప్ లోని ప్రయాణీకులంతా లోపలే ఉండాలని ఎవరూ బయటకు రావద్దని చెప్పడంతో అంతా అయోమయానికి గురవుతున్నారు. షిప్ లోని పేషెంట్లు, ప్రయాణీకుల మానసిక శాంతితో పాటు వారికి కావాల్సినవన్ని సమకూర్చాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ టోక్యోను కోరింది.