ఆస్ట్రేలియాలో భారత డిగ్రీలను గుర్తిస్తామని ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. భారత-ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ‘ఆస్ట్రేలియా-ఇండియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెకానిజం’ అనే వ్యవస్థను ఖరారు చేశాయని, దీని ద్వారా ఇకపై తమ దేశంలో ఇండియన్ డిగ్రీలను గుర్తిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన.. గుజరాత్ లో మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ విద్యార్హతలు ఉన్న స్టూడెంట్స్ కి ఆస్ట్రేలియాలో గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
అలాగే తమ దేశంలో చదివిన భారతీయ విద్యార్థులకు ఇండియాలో ఆస్ట్రేలియన్ డిగ్రీల గుర్తింపు కూడా ఉంటుందన్నారు. విద్యా రంగానికి సంబంధించి ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో మైలురాయని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో భారీ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారని, రెండు దేశాల మధ్య మైత్రీ సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆంథోనీ పేర్కొన్నారు.
మా దేశంలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు కొత్తగా స్కాలర్ షిప్ కూడా మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు. ‘మైత్రి స్కాలర్ షిప్’ పేరిట ఇచ్చే ఈ మొత్తాన్ని ఆస్టేలియాలో నాలుగేళ్ల వరకు చదవాలనుకునేవారికి ఇస్తామని చెప్పారు.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ కి ముందు ప్రధాని మోడీ, ఆంథోనీ అల్బనీస్.. ఇద్దరూ ఒకే వాహనంపై కలయదిరుగుతూ ప్రేక్షకులకు విషెస్ చెప్పారు.