ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపుగా పెద్ద ఎత్తున తన బలగాలను రష్యా మోహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారతీయ పౌరులకు అక్కడ భారత రాయబార కార్యాలయం మంగళవారం కీలక సూచనలు చేసింది.
ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు సహా భారతీయ పౌరులందరూ వెంటనే రాజధాని కీవ్ ను విడిచి పెట్టి రావాలని సూచించింది. అందుబాటులో ఉన్న రైళ్లతో పాటు ఏదైనా ప్రయాణ సాధనాలను ఉపయోగించుకుని కైవ్ నుంచి వచ్చేయాలని తెలిపింది.
అంతకు ముందు ఉక్రెయిన్ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తి వేశారు. ఈ క్రమంలో విద్యార్థులంతా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాలకు చేరుకునేందుకు గాను రైల్వే స్టేషన్లకు చేరుకోవాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
రైల్వే స్టేషన్ల దగ్గర పాటించాల్సిన నియమాల గురించి భారతీయ పౌరులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. రైల్వే స్టేషన్లలో దూకుడుతనంతో వ్యవహరించవద్దని, శాంతంగా ఉండాలని భారతీయ పౌరులను ఎంబసీ కోరింది.