ఉక్రెయిన్ పై రష్యా రాకెట్లు, క్షిపణి దాడులతో విరుచుకు పడడంతో.. రాజధాని కీవ్ సహా అనేక నగరాల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. రష్యా దాడుల్లో చాలామంది మరణించారని, 60 మందికి పైగా గాయపడ్డారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మరిన్ని దాడులు తప్పవని అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇండియన్స్ ఎవరూ అత్యవసరమైతే తప్ప ఈ దేశంలో ప్రయాణాలు చేయరాదని ఇక్కడి భారత రాయబార కార్యాలయం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. దీన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది.
ఇదే సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, స్థానిక అధికారులు జారీ చేసిన సేఫ్టీ గైడ్ లైన్స్ ని కూడా ఏ మాత్రం అలక్ష్యం చేయరాదని పేర్కొంది. ఈ యుద్ధ భూమిలో మీ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలని కోరింది. నిన్న మొన్నటివరకు దాదాపు ప్రశాంతంగా ఉన్న కీవ్ నగరంలో ఇప్పడు ఎక్కడ చూసినా దగ్ధమైన కార్లు, ఇతర వాహనాలు, దెబ్బ తిన్న భవనాలు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ పై తాము 83 మిసైల్స్ ని ప్రయోగించినట్టు రష్యా ప్రభుత్వం వెల్లడించింది. తమ దేశాన్ని కలుపుతున్న క్రిమియా బ్రిడ్జిని ఉక్రెయిన్ దళాలు పేల్చి వేయడంతో పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు.
ఉక్రెయిన్ లోని పరిస్థితిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తూ..వైషమ్యాలు మంచిది కాదని, తక్షణమే వీటికి స్వస్తి చెప్పి సాధారణ పరిస్థితి నెలకొనేలా దౌత్యపరమైన చర్చలకు కూర్చోవాలని సూచించింది. రష్యా గురించి నేరుగా ప్రస్తావించకుండా.. ఉద్రిక్తతల నివారణకు జరిగే ఏ ప్రయత్నానికైనా తాము సహకరిస్తామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కీవ్ లోని భారతీయులు అవసరమైతే కాంటాక్ట్ చేయడానికి వీలుగా ఈ-మెయిల్స్, ఫోన్ నెంబర్లు, , వెబ్ సైట్లు, ఫేస్ బుక్ వివరాలను వెల్లడించింది.