భారత్‌లోని పలు కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగులకు భారీగా వేతన పెంపు చేయనున్నట్టు కార్న్ ఫెర్రీ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఆసియాలోనే అతి పెద్ద వేతన పెంపు చేసేందుకు భారతీయ కంపెనీలు సిద్దమవుతున్నట్టు ఆ సంస్థ సర్వేలో తెలిపింది. అగ్రశ్రేణి ప్రతిభావంతులకు ఈ సారి 15 నుంచి 30శాతం వెతనం పెరిగే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది.
గతేడాది 9.4శాతం పెంపు తర్వాత ఈ ఏడాది 9.8శాతం వేతాన్ని భారతీయ కంపెనీలు పెంచేందకు రెడీ అవుతున్నాయని నివేదికలో వెల్లడించింది. హైటెక్ పరిశ్రమలు, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో 10శాతం కన్నా ఎక్కువ హైక్ వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్పింది.
భారత్‌లో 818 కంపెనీల్లో కార్న్ ఫెర్రీ సంస్థ సర్వే నిర్వహించింది. నివేదిక ప్రకారం… 61శాతం సంస్థలు గతంలో నిలిపి వేసిన చెల్లింపులను సంస్థలోని కీలక వ్యక్తులకు ఈ ఏడాది చెల్లించనున్నాయి. భారత్ లోని 9.8శాతం పెంపుతో పోలిస్తే ఆస్ట్రేలియాలో 3.5 శాతం వేతన పెంపు ఉంటుంది.
చైనాలో 5.5 శాతం, హాంకాంగ్ 3.6శాతం, ఇండోనేషియా 7 శాతం, కొరియాలో 4.5శాతం , మలేషియాలో5 శాతం, న్యూజిలాండ్ 3.8 శాతం, పిలిప్పీన్స్ 5.5శాతం, సింగపూర్ 4 శాతం, థాయ్ లాండ్ 5శాతం, వియత్నాంలో 8 శాతం పెంపు వుంటుంది. ఉద్యోగులు హైబ్రీడ్ వర్క్ మోడల్ లో పని చేయాలని 60శాతం కంపెనీలు కోరుతున్నట్టు నివేదిక వెల్లడిచింది.