26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సందీప్ జీవితంలో జరిగిన సంఘటనలు.. ఆర్మీలో చేరడం.. ఉగ్రదాడులలో ప్రాణత్యాగం చేయడం వంటి అంశాలను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్టు చూపించారు డైరెక్టర్ శశికిరణ్ తిక్క. ఈ సినిమాలో కీలకమైన మేజర్ సందీప్ పాత్రలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించగా.. ఆయన తల్లిదండ్రుల పాత్రలలో ప్రకాష్ రాజ్, రేవతి ఒదిగిపోయారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెకక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాగా.. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏప్లస్ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మరోవైపు మేజర్ మూవీలోని సాంగ్స్ సైతం ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటున్నాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సామాన్యులు, సెలబ్రెటీల నుంచి ఈ సినిమాకు అనుహ్య స్పందన వస్తోంది.
ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రశంసలు కురింపించారు. తాజా భారత మాజీ క్రికెటర్.. నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం మేజర్ సినిమాపై స్పందించారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు..
“ఇప్పుడు మేజర్ సినిమాను చూశాను.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఒక ఎమోషన్.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు సంబంధించి స్పూర్తినిచ్చే కథనం ఇది.. ప్రతి ఒక్కరి భావాలను తాకుతుంది.. మేజర్ పాత్రలో అడివి శేష్ అద్భుతంగా నటించారు.. ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి..” అంటూ లక్ష్మణ్ ట్వీట్ చేస్తూ.. మేజర్ పోస్టర్ షేర్ చేశారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.