ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ- అస్ట్రాజెనికా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిశీల్డ్ ను భారత్ లోనూ వినియోగించేందుకు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాక్సిన్ ను అత్యవసర వ్యాక్సినేషన్ కు బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో భారత నిపుణుల కమిటీ సాయంత్రం సమావేశం కానుంది.
ఇప్పటికే అత్యవసర వ్యాక్సినేషన్ కోసం ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరం సంస్థ అప్లై చేసుకుంది. అయితే, నిపుణుల కమిటీ మరింత డేటా కోరటంతో ఇప్పటికే సీరం సంస్థ ఆ డేటాను అందజేసింది. పైగా బ్రిటన్ ప్రభుత్వం, డ్రగ్ రెగ్యూలెటరీ సంస్థలు కూడా అనుమతిచ్చిన నేపథ్యంలో భారత నిపుణుల కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లాంఛనంగా కనపడుతుంది.
నిపుణుల కమిటీ అంగీకారం రాగానే… భారత ప్రభుత్వం కూడా వెంటనే వ్యాక్సినేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యాక్సిన్ డ్రై రన్ కూడా నిర్వహించి రెడీగా ఉన్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.