ఆ కుటుంబమంతా నదిలో మునిగి..

అమెరికాలో ఉంటున్న భారత సంతతి కుటుంబ విహార యాత్ర విషాదాంతమైంది. సరదాగా గడిపేందుకు వెకేషన్ టూర్ వేసుకున్న ఈ కుటుంబ సభ్యులు కాలిఫోర్నియాలోని ఈల్ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. 41 ఏళ్ళ సందీప్ తోటపిల్లి, తొమ్మిదేళ్ళ ఆయన కూతురు సాచీల మృత దేహాలను సహాయకసిబ్బంది ఈ నెల 15 న కనుగొన్నారు. ఇటీవలే సందీప్ భార్య సౌమ్య (38) డెడ్ బాడీని నది నుంచి బయటకు తీశారు. 12 ఏళ్ళ వీరి కుమారుడు సిద్ధాంత్ ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.

సుమారు 10 రోజుల క్రితం వీరు ప్రయాణిస్తున్న కారు నదిలో పడిపోగా అప్పటి నుంచి వీరికోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలిస్తున్న సంగతి విదితమే. నదిలో నాలుగు అడుగుల నుంచి ఆరు అడుగుల లోతులో వీరి కారు పడిపోయి ఉందని పోలీసులు తెలిపారు. సందీప్, సాచీల మృతదేహాలు వీరి హోండా పైలట్ కారులోనే చిక్కుకుపోయి ఉండగా వెలికి తీశారు. నదిలో ఒకచోట పెట్రోలు వాసన వస్తున్నట్టు గుర్తించిన రెస్క్యూ టీమ్.. అక్కడ గాలించగా..మునిగి ఉన్న వీరి వాహనం కనిపించిందని పోలీసులు చెప్పారు. ఈ కుటుంబం ఓరెగావ్ లోని పోర్ట్ ల్యాండ్ నుంచి సదర్న్ కాలిఫోర్నియాలోని సాన్ జోస్ కు వెళ్తూ ప్రమాదం బారిన పడింది. గుజరాత్ వాసి అయిన సందీప్ కొన్నేళ్ళక్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిర పడ్డారు.