క్రీడలంటే ఎంతో ఇష్టపడే భారతదేశం.. ఆ క్రీడల్లో పోటీపడేలా ఎదగాలని ఆకాక్షించారు టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్. స్వాతంత్ర్యదినోత్సవ వేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలని కోరారు. అందుకు ఇదే సరైన సమయం కూడా అని ఆయన నొక్కి చెప్పారు.
రెండేళ్లుగా కరోనా వైరస్ భారతీయులని ఎంతగానో ప్రభావితం చేసిందని, అందిరిని ఇళ్లల్లో కూర్చోబెట్టి చిన్న చిన్న విషయాలను మనం ఎం తేలికగా తీసుకుంటున్నామో అర్థమయ్యేలా చేసిందని సచిన్ వివరించారు. స్వేచ్ఛగా తిరగడానికి, ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేకుండా పోయిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఒలింపిక్స్ ప్రారంభమైనప్పుడు.. అక్కడికి వెళ్లిన వారిని చూసి.. మళ్లీ దేశానికి స్వేచ్ఛ వచ్చిందేమో అనిపించిందని చెప్పారు.
దురదృష్టవశాత్తూ కొన్ని కోల్పోయాకే వాటి విలువ తెలుస్తుందని, దేశంలో చాలా మంది ఆరోగ్యం విషయంలో దాన్ని అనుభవిస్తారని అభిప్రాయపడ్డారు సచిన్. భారత్ పిన్న దేశమే కానీ.. ఫిటెనెస్ ఉన్న దేశం కాదని కుండబద్దలు కొట్టారు. దీన్ని బట్టే భారత్ క్రీడల విషయంలో ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చిన తెలిపారు. మనం మన పిల్లలని ఎలా చూడాలనుకునే దాన్ని బట్టి.. మనదేశం అలా ఎదుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. క్రీడలని మనదేశం విద్యకు ప్రత్యామ్నాయంగా లేదా అవసరంగా చూడటం లేదని అన్నారు. క్రీడలంటే కేవలం శారీరక భావన కాదని.. అది వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలని పెంపొందిస్తుని చెప్పారు. మానవ విలువల్లో అవి చాలా ముఖ్యమైనవని తెలిపారు.