చైనా యాప్ లపై ఇండియా మళ్ళీ కొరడా ఝళిపించింది. ఆ దేశానికి చెందిన 232 యాప్ లను నిషేధించింది. వీటిలో 138 బెట్టింగ్ యాప్ లు, 94 లోన్ యాప్ లు ఉన్నాయి. హోమ్ శాఖ ఆదేశాల మేరకు ‘అర్జంట్’ ‘ఎమర్జెన్సీ’ బేసిస్ పై ఈ చర్య తీసుకుంటున్నట్టు ఎలెక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ విభాగం ప్రకటించింది. ఈ యాప్ లు భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే విధంగా ఉన్నందున ఐటీ చట్టం లోని 69 సెక్షన్ కింద వీటిపై బ్యాన్ విధిస్తున్నట్టు పేర్కొంది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ చట్ట విరుద్ధమని, ఈ యాప్ ద్వారాల యాడ్ లు ఇవ్వడం 2019 నాటి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లోని నిబంధనలతో బాటు 1995 నాటి కేబుల్ టీవీ నెట్ వర్క్ రెగ్యులేషన్ చట్టం, 2021 నాటి ఐటీ నిబంధనల కింద కూడా నిషేధమని ఈ ఆదేశాల్లో వివరించారు. భారతీయులకు ఆన్ లైన్ ద్వారా ఈ విధమైన ప్రకటనలు ఇవ్వడాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా నిషేధించింది.
సుమారు 6 నెలల క్రితమే 288 కి పైగా చైనా యాప్ లను విశ్లేషించే పనిని ప్రభుత్వం చేబట్టింది. భారతీయుల వ్యక్తిగత డేటాను ఇవి సులభంగా యాక్సెస్ చేస్తున్నట్టు గుర్తించింది. ఆకర్షణీయమైన ప్రలోభాలతో ..మీకు రుణాలు ఇస్తామంటూ ఇవి ముఖ్యంగా పేదలను, చిన్న పాటి లోన్ల కోసం వేచిఉన్నవారిని, యువతను ఆకర్షిస్తున్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది.
భారతీయుల్లో కొందరిని చైనీయులు ‘అద్దె’ ప్రాతిపదికన ఎంపిక చేసుకుని ఈ దందాకు పూనుకొంటున్నారు. మొదట రుణాలు ఇచ్చినట్టే ఇచ్చి ఆ తరువాత అమాయకులపై వడ్డీ భారాన్ని పెంచుతూ వారి జీవితాలతో ఈ యాప్ లు ఆడుకొంటున్నాయని, వడ్డీ కట్టలేనివారిని ఏజంట్లు అదేపనిగా వేధిస్తూ ఒక్కోసారి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఈ యాప్ లపై బ్యాన్ విధించింది.