భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కరోనా నాసికా వ్యాక్సిన్ ను కేంద్రం రిలీజ్ చేసింది. భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ ను ముక్కులో నేరుగా వేసుకునే అవకాశం ఉంది. ఇండియాలో మొదటి నాసికా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ కలిసి ఈ టీకాను గురువారం ఢిల్లీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు పలు వ్యాక్సిన్ల ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు కోవిడ్ నాసికా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. ఇన్ కోవాక్ పేరుతో భారత బయోటెక్ సంస్థ ఈ టీకాను అభివృద్ధి చేసింది. గతేడాది నవంబర్ లోనే ఈ టీకా వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ కు ప్రభుత్వానికి 325కి భారత్ బయోటెక్ విక్రయించబోతోంది.
అలాగే ప్రైవేట్ ఆసుపత్రులలో దీని ధర రూ.800గా నిర్ణయించింది. నాసికా వ్యాక్సిన్ ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించవచ్చు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో అత్యవసర పరిస్థితుల్లో ఈ నాసికా వ్యాక్సిన్ వాడేందుకు ఆమోదించింది. రెండు డోసుల్లో ముక్కు ద్వారా తీసుకునే మొట్టమొదటి ప్రాథమిక టీకా కూడా ఇదేనని భారత బయోటెక్ వెల్లడించింది.
ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇంకొవాక్ నాసికా వ్యాక్సిన్ ను బూస్టర్ గా పొందవచ్చు. మరోవైపు ఈ నాసికా వ్యాక్సిన్ కావాలంటే కోవిన్ వెబ్‌సైట్ లోకి వెళ్లి డోస్ కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవచ్చని భారత్ బయోటెక్ చెబుతోంది. ప్రస్తుతం దీన్ని బూస్టర్ డోస్ గా తీసుకునేందుకు అవకాశం ఉండటంతో విక్రయాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.