యూఎస్, యూకేతో సహా అరడజనుకు పైగా దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఫైజర్- బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను ఇండియా కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఫైజర్ వ్యాక్సిన్ ధర అత్యధికంగా ఉండటంతో దాన్ని కొనుగోలు చేయకపోవడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఫైజర్ వ్యాక్సిన్ ధర ప్రస్తుతం 37 యూస్ డాలర్లుగా ఉంది. అయితే ఇదే సమయంలో ఇతర దేశాలు, భారత కంపెనీలు రూపొందిస్తున్న వ్యాక్సిన్ల ధర మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. అక్స్‌ఫర్డ్ అస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ సంయుక్తంగా తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసు ధర కేవలం 3 యూఎస్ డాలర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇక రష్యా తయారు చేస్తున్న స్పత్నిక్ వీ కూడా ..ఫైజర్ వ్యాక్సిన్ కంటే తక్కువ ధరకే లభిస్తోంది. స్పుత్నిక్ వీ ధర 10 యూఎస్ డాలర్లుగా ఉండనుంది. అటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్ అలాగే జైడుస్ కాండీలా తయారు చేస్తున్న వ్యాక్సిన్ల ధరలు కూడా 6 డాలర్లకు అటు, ఇటుగా ఉండే అవకాశముంది.
వ్యాక్సిన్ల ధర సంగతి పక్కనబెడితే వాటిని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచేందుకే ప్రభుత్వం అదనంగా మరికొంత వ్యయం అయ్యే అవకాశముంది. దీంతో ఫైజర్ టీకాను కొనుగోలు చేస్తే ప్రభుత్వానికి ఖర్చు తడిసి మోపడవుతుంది. దీంతో ఇండియా ఫైజర్ టీకాను కొనుగోలు చేయకపోవచ్చని వైద్య నిపుణులు భావిస్తున్నారు.