మరో 45 లక్షల డోసుల కోవాక్జిన్ టీకాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో 8 లక్షల డోసులను మిత్ర దేశాలైన మారిషస్, ఫిలిప్పీన్స్, మయమ్మార్ దేశాలకు భారత్ బయోటెక్ స్నేహపూర్వకంగా ఉచితంగా అందించనుంది. కేంద్రం నుండి తదుపరి ఉత్తర్వులు అందగానే సంస్థ టీకాను పంపిణీ చేస్తుందని భారత్ బయోటెక్ వర్గాలు తెలిపాయి.
సంస్థ నుంచి పంపిణీ చేసే టీకాల సంఖ్య ప్రభుత్వ కొనుగోలు మీద ఆధారపడి ఉంటుందని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి. కేంద్రం ఇప్పటికే 55 లక్షల డోసులను కొనుగోలు చేసింది. వీటిని 11 నగరాలకు పంపిణీ చేసింది. ఇందులో విజయవాడ, గౌహతి, పాట్నా, ఢిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణే, భువనేశ్వర్, జైపూర్, చెన్నై, లక్నో సిటీలున్నాయి. కేంద్రానికి తాము 16.5 లక్షల డోసులను ఉచితంగా అందించామని భారత్ బయెటెక్ తెలిపింది.