అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెలుపల ఖలిస్థాన్ మద్దతుదారుల నిరసనలను కవర్ చేస్తున్న భారతీయ జర్నలిస్ట్ పై దాడి జరిగింది. ఇండియన్ జర్నలిస్ట్ లలిత్ ఝా పై వారు దాడి చేయడంతో పాటు దుర్భాషలాడినట్లు సమాచారం. ఈ దాడిని భారత రాయబార కార్యాలయం ఖండించింది.
ఈ దాడి నుంచి తనను రక్షించినందుకు లలిత్ యూఎస్ సీక్రెట్ అధికారులకు ట్విటర్ ద్వారా కృతజ్ఙతలు తెలిపారు. ఖలిస్తాన్ మద్దతుదారులు తన ఎడమ చెవిపై కర్రలతో కొట్టారని చెప్పారు. ఖలిస్తాన్ మద్దతుదారుల వీడియోను కూడా ఆయన తన ట్విటర్ లో ఉంచారు. ”ముందుగా నన్ను వారి బారి నుంచి రక్షించిన అధికారులకు నా ధన్యవాదాలు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే. లేకపోతే ఈరోజు నేను కచ్చితంగా ఆసుపత్రి పాలయ్యే వాడిని” అంటూ ఆయన పేర్కొన్నారు.
ఒకానొక సమయంలో నేను చాలా బెదిరింపులకు పాల్పడ్డాను. ఆ సమయంలో నేను 911 కి కాల్ చేశాను. ఆ తరువాత సీక్రెట్ సర్వీస్ అధికారులను గుర్తించి వారికి నా పరిస్థితిని తెలియజేశాను అని వివరించారు. అయితే తన మీద దాడి చేసిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోకూడదని లలిత్ నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
శనివారం అమృత్‌పాల్ సింగ్ కి మద్దతుగా యూఎస్ సీక్రెట్ సర్వీస్ సమక్షంలో రాయబార కార్యాలయం ముందు ఖలిస్థాన్ మద్దతుదారులు నిరసనకు దిగారు. వారు రాయబార కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామని బహిరంంగానే ప్రకటించారు. అంతేకాకుండా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధును కూడా బెదిరించారని లలిత్ పేర్కొన్నారు. నిరసనకారులు ఇంగ్లీష్, పంజాబీలో భారతదేశ వ్యతిరేక ప్రసంగాలు చేసినట్లు లలిత్ పేర్కొన్నారు.
ఈ ఘటనను ఖండిస్తూ, భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో, “ఒక సీనియర్ జర్నలిస్ట్‌పై ఇంత ఘోరమైన దాడిని మేము ఖండిస్తున్నాము. ఇటువంటి కార్యకలాపాలు ‘ఖలిస్థానీ నిరసనకారులు’ మరియు వారి మద్దతుదారుల హింసాత్మక ధోరణిని తెలియజేస్తున్నాయని పేర్కొంది.జర్నలిస్టును మొదట మాటలతో బెదిరించారని, ఆపై శారీరకంగా దాడి చేశారని తెలపింది.