అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన దేశీయ మద్యం కంపెనీలను బెంబెలెత్తిస్తున్నాయి. వచ్చే వారం ట్రంప్ రాకముందే భారత ప్రభుత్వంతో తమ గోడును వెల్లబోసుకుంటున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకపోవటంతో… ఏం జరుగుతుందోనని దేశీయ మద్యం వ్యాపారులంతా టెన్షన్ పడుతున్నారు.
ట్రంప్ భారత పర్యటనలో కీలకమైన ఎజెండాలో అమెరికన్ లిక్కర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలన్నది ఎజెండా. ఇదొక్కటే కాదు అమెరికా నుండి భారత్ దిగుమతి చేసుకుంటున్న అన్ని వస్తువులపై భారత్ అధిక పన్నులు వేస్తుందని ఎంతో కాలంగా ట్రంప్ గుర్రుగా ఉన్నాడు. దీంతో ఈసారి అమెరికన్ మేడ్ లిక్కర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుందని భారత మద్యం తయారీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
అమెరికన్ లిక్కర్‌కు అవకాశం ఇస్తే… యూరోపియన్ దేశాలన్నీ అదేవిధంగా ఒత్తిడి తెస్తాయి, అప్పడు దేశీయ మద్యం తయారీ వ్యాపారులకు నష్టాలు తప్పవని ఇప్పటికే కామర్స్ మినిస్టర్ పియూష్ గోయల్‌కు లేఖ రాసింది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్కహలిక్ బేవరేజేస్ కంపెనీస్.
ఆయా దేశాలు భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాయి, కానీ ఇండియాలో తయారైన మద్యాన్ని మాత్రం తమ దేశంలో భారత్ ఇచ్చే రేట్లకు ఇవ్వనివ్వదు… అలాంటప్పుడు భారత్ ఎందుకు అంగీకరించాలన్నది భారత కంపెనీల వాదన. మరీ దీనిపై ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే… అమెరికన్ లిక్కర్ ధరలు భారీగా దిగివచ్చే అవకాశం కనపడుతోంది.