పెండ్లికి హెలికాప్టర్ లో వచ్చి వరుడు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఇటీవల ట్రెండ్ గా మారింది. దీంతో చాలా మంది తాము కూడా అలా గ్రాండ్ ఎంట్రీ ఇస్తే బాగుండు అనుకుంటున్నారు.
అందుకోసం లక్షల్లో డబ్బులు వెచ్చించి హెలికాప్టర్ అద్దెకు తీసుకుని తమ ముచ్చటను తీర్చుకుంటున్నారు. అయితే ఇది బాగా డబ్బు ఉన్న వాళ్లు చేసే పని.
మరి మధ్యతరగతి వారి సంగతేంటి.. ఆ కోరిక అలాగే ఉండిపోవాలా.. సరిగ్గా ఇదే ఆలోచన బీహార్ లో గుడ్డు అనే యువకుడికి వచ్చింది. దీనికి ఎలాగైనా పరిష్కారం కనుక్కోవాలనుకున్నాడు.
అందుకే తన దగ్గర ఉన్న కారునే హెలికాప్టర్ గా మార్చాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రూ. 2 లక్షలు ఖర్చు పెట్టి అనుకున్న పనిని పూర్తి చేశాడు.
పెండ్లికి హెలికాప్టర్ లో వెళ్లాలని కలలు గనే వరులు అతని దగ్గరికి వెళుతున్నారు. వారికి రోజుకు రూ. 15వేల చొప్పున అద్దెకు ఇస్తున్నారు.
అయితే ఈ హెలికాప్టర్ గాలిలో ఎగరదు. అయినప్పటికీ హెలికాప్టర్ లో ప్రయాణించిన ఫీలింగ్ కలుగుతుండటం, తక్కువ ధరకే అందుబాటులో ఉండటం చాలా మంది గుడ్డు దగ్గర దీన్ని అద్దెకు తీసుకుంటున్నారు.