కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. ప్రజలంతా ఇంట్లో ఉన్నారు.కానీ దేశంలో వలస కార్మికులు మాత్రం నరకం అనుభవిస్తున్నారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ తో పాటు, దాని చుట్టుపక్కల నోయిడా, గురుగ్రామ్ తదితర మెగా సిటీల్లో కూలీలుగా పనిచేస్తోన్న లక్షలాది మంది.. లాక్ డౌన్ కారణంగా పనికోల్పోయారు. కేసుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. లాక్ డౌన్ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడని కార్మికులు తిండిలేక, పట్టణాల్లో అద్దెలు కట్టలేక,సొంతూరిబాటపట్టారు.
లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వలస కూలీలంతా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంత ఊళ్లకు నడిచి వెళుతున్నారు.
ఈ నడక దారిలో ఓ కూలి ప్రాణాలు కూడా కోల్పోయాడు. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉన్నా , ఢిల్లీ లో పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కేంద్రం, రాష్ట్రాలు పూర్తిగా వలస కూలీలను విస్మరించారు. ఇలాంటి పరిస్థితిని కనీసం అంచనా కూడా వేయలేకపోయాయి. ఢిల్లీ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల కోసం బస్సులు ఏర్పాటు చేయడంతో జనం ఎగబడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చేపట్టిన లాక్ డౌన్ చర్యలు దెబ్బతినే పరిస్థితి కనిపించింది. ఇది పూర్తిగా ప్రభుత్వాల వైఫల్యం అని చెప్పక తప్పదు.
ఒకవైపు కేంద్ర హోం శాఖ ఎవరిని వారి వారి ప్రాంతాల నుండి కదల నివ్వొద్దనే ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఆ కూలీలను పట్టించుకోకపోవడం ఆగ్రహాన్ని కలిగించాయి. ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ప్రత్యేక విమానాల్లో రప్పించిన కేంద్రం, వలస కూలీల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడమేంటని విమర్శిస్తున్నారు. హైవేపై బిడ్డల్ని, బట్టల మూలల్ని ఎత్తుకుని నడుస్తూ తల్లులు పడుతోన్న అరిగోస అందర్నీ కంటతడిపెట్టించేలా ఉంది. రోడ్డు పక్కన చెట్ల నీడలో సేద తీరుతూ ముందుకు సాగుతున్నారు. కరోనా భయాల కారణంగా మొదటి రెండ్రోజులు ఏ ఊళ్లోనూ కూలీలకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకలేదు. ‘కరోనా వైరస్ సంగతేమోగానీ.. ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం..’అని పేద కూలీలు రోదిస్తున్నారు.
ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు, 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించే ముందు పర్యవసానాలు కనీసం కేంద్రం పట్టించుకోలేదు. పేద కూలీలు కదా, ఏముంది లే అనే వైఖరి ప్రభుత్వాల్లో కనిపించింది.ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. నిర్ణయం తీసుకునే ముందు వేలాది వలస కూలీలను పరిగణలోకి తీసుకొని , ఎక్కడి వారు అక్కడే ఉండేలా చర్యలు తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఒకేసారి బస్సులను ఏర్పాటు చేసి, జనాన్ని గుంపులు గుంపులు గా పోగు అయ్యేలా నిర్ణయాలు తీసుకొని లాక్ డౌన్ ఫలితాన్ని నిర్వీర్యం చేశాయి ఈ ప్రభుత్వాలు.