టర్కీ భూకంపంలో ఓ భారతీయుడు గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హ్వాల్ కు చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి టర్కీ లోని మలత్యా ప్రావిన్స్ లో గల ఓ ఫోర్ స్టార్ హోటల్ లో దిగాడని, భూకంపంలో ఈ హోటల్ నేలమట్టం కాగా ఆయన గల్లంతయ్యాడని తెలిసింది. సహాయక బృందాలకు శిథిలాల్లో ఇతని పాస్ పోర్టు, మరికొన్ని వస్తువులు లభించాయి.
బెంగుళూరు లోని ఓ కార్పొరేషన్ కి చెందిన ఓ వర్కర్ జాడ కూడా తెలియడం లేదు. విజయ్ కుమార్ ఇంజనీర్ అని తెలుస్తోంది. బహుశా విజయ్ కుమార్, ఆ వర్కర్ ఇద్దరూ గాయపడి ఉండవచ్చా అన్న అనుమానంతో రక్షణ బృందాలు దగ్గరలోని ఆసుపత్రులను విజిట్ చేస్తున్నాయి.
ఈ హోటల్ లోని రెండో అంతస్థులో బస చేసిన విజయ్ కుమార్ నిద్రలోనే భూకంప ప్రభావానికి గురై ఉంటాడని భావిస్తున్నామని విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఆచూకీ కనబడలేదంటే బహుశా సజీవంగానే ఉండవచ్చునని ఇండియాలోని అతని కుటుంబ సభ్యుల్లో ఆశలు కలుగుతున్నాయి.
టర్కీలో ఆరున్నరవేలకు పైగా భవనాలు, ఇతర కట్టడాలు, పురావస్తు ప్రాధాన్యం గల కోటలవంటివి భూకంప ధాటికి కుప్ప కూలాయి. ఎక్కడ చూసినా నేలకొరిగిన శిథిలాలతో నగరాలకు నగరాలు మరుదిబ్బలను తలపిస్తున్నాయి.