భూతలం నుంచి గగనతలం లోని లక్ష్యాన్ని ఛేదించగల మీడియం రేంజి మిసైల్ ని భారత నేవీ విజయవంతంగా ప్రయోగించింది. విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి జరిగిన ఈ ప్రయోగం జయప్రదం కావడం పట్ల డీఆర్డీఓ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో కలిసి ఈ సంస్థ భారత్ డైనమిక్స్ కంపెనీలో ఈ మిసైల్ ని తయారు చేసింది.
ఈ క్షిపణిని కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్టు ఈ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5 న అరేబియా సముద్రం నుంచి నిర్వహించిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం కూడా విజయవంతమైంది.
తాజాగా తయారు చేసిన మీడియం రేంజ్ క్షిపణిని భారత ఆర్మీ, వైమానికదళం కూడా వినియోగించుకోవచ్చునని, దీని రేంజ్ 70 కి. మీ. అని తెలుస్తోంది.
ఇది విమానాలను, డ్రోన్లను, హెలీకాఫ్టర్లను కూడా కూల్చివేయగలదని డీఆర్డీఓ పేర్కొంది. భారత రక్షణ పాటవాన్ని పెంపొందించుకునేందుకు ఎప్పటికప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రక్షణ వ్యవస్థలను తయారు చేస్తున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.