భారత సంతతికి చెందిన అజయ్ బంగాను కీలక పదవి వరించనుంది. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక ఇక లాంఛన ప్రాయమే కానుంది. ఈ పదవికి ఆయన తప్పా మరెవరూ పోటీలో లేకపోవడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది.
ఆయనకు పోటీగా ఏ దేశమూ కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్సాస్ పదవీ కాలం వచ్చే ఏడాదితో ముగియనుంది. కానీ తాను ముందస్తు పదవీ విరమణ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అభ్యర్థిగా అజయ్ బంగాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. చాలా ఏండ్లుగా అమెరికా ప్రతిపాదించిన వ్యక్తికే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష బాధ్యతలు దక్కుతూ వస్తున్నాయి. దీంతో ఈ సారి అజయ్ బంగా విషయంలోనూ అదే జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.
ఇది ఇలా వుంటే ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ జూన్లో ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తర్వాత మాల్ పాస్ నుంచి అజయ్ బంగా ఆ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికోసం నామినేట్ అయిన తొలి భారత సంతతి వ్యక్తి అంజయ్ బంగా కావడం గమనార్హం.