అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు యువకుడు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హత్యకు కుట్ర పన్ని ఓ తెలుగు సంతతికి చెందిన యువకుడు పట్టుబడ్డాడు. వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చిన ఆ యువకుడు బారికేడ్లను ఢీకొట్టాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదే సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను గుర్తించారు పోలీసులు. స్థానిక కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9.40 గంటలకు ఈ ఘటన జరిగింది.
సదరు యువకుడిని సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. సాయివర్షిత్ వయసు 19 సంవత్సరాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నినట్లుగా కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సాయివర్షిత్ కందుల అమెరికాలోని మిస్సోరి స్టేట్ చెస్ట్ ఫీల్డ్ లో ఉంటున్నాడు. 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూల్ నుంచి అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇటీవల మిస్సోరి నుంచి వాషింగ్టన్ డీసీకి ఫ్లైట్ లో వచ్చిన సాయివర్షిత్ వచ్చీరాగానే ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని నేరుగా వైట్ హౌస్ లోకి దూసుకెళ్లాడు.
ఈ క్రమంలో మొదటి బారికేడ్ వద్దనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాగా ఈ విషయాన్ని అధికారులు 23వ తేదీ ఉదయం బైడెన్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్మీడియా అకౌంట్స్ ద్వారా సాయివర్షిత్ గురించి పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.