రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రపతి పదవికి ఎన్నికను జూలై 18న నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అవసరమైతే కౌంటింగ్‌ను జూలై 21న నిర్వహిస్తామని.. కొత్త రాష్ట్రపతి జూలై 25న ప్రమాణ స్వీకారం చేస్తారని కమిషన్ తెలిపింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. 2017లో బీహార్ గవర్నర్ గా పనిచేస్తున్న రామ్ నాథ్ కోవింద్ ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. దీంతో ప్రతిపక్ష శిబిరంలో చీలిక తేవడంలో బీజేపీ విజయం సాధించింది.
మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 702,044 ఓట్లు ఉండగా అందులో 65.65 శాతం ఓట్లుు రామ్ నాథ్ కోవింద్ కు వచ్చాయి. దీంతో లోక్‌సభ మాజీ స్పీకర్, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థి మీరా కుమార్‌ను ఓడించి భారతదేశానికి 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేశారు.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ సభ్యులు ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల గణంలో ఉభయ సభల్లోని ఎన్నికైన ఎంపీలు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉంటారు.
దేశ రాజధాని న్యూ ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన శాసన సభ సభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు రాజ్యాంగం అవకాశం కల్పించింది.