దేశంలో ఎనిమిదేండ్లలో బయో ఎకనామి ఎనిమిది రెట్లు పెరిగినట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఎనిమిదేండ్లలో బయో ఎకనామి 10 బిలియన్ డాలర్ల నుంచి 80 డాలర్లకు పెరిగిందని ఆయన వివరించారు. బయో స్టార్టప్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ….
దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి రంగాన్నీ బలోపేతం చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు కొన్ని రంగాలపై మాత్రమే ఫోకస్ చేసేవని, మిగతా వాటిని నిర్లక్ష్యం చేసేవని ఆయన పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక ఈ విధానంలో మార్పులు తీసుకు వచ్చామని ఆయన వివరించారు.
బయోటెక్ గ్లోబల్ ఎకోసిస్టమ్‌లో టాప్ 10 దేశాల లీగ్‌కి చేరుకోవడానికి దేశం ఎంతో దూరంలో లేదన్నారు. ఈ ఎనిమిదేండ్లలో దేశంలో స్టార్టప్ సంఖ్య వంద నుంచి 70000కు పెరిగిందని తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను బలోపేతం చేయడానికి, వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
బయోటెక్ ఇంక్యుబేటర్ల సంఖ్య 2014లో ఆరు ఉండగా, నేడు అది 75కి పెరిగిందన్నారు. బయోటెక్ ఉత్పత్తులు 10 నుంచి నేడు 700కు పైగా రకాలకు పెరిగాయన్నారు. బయోటెక్ రంగంలో పెట్టుబడిదారుల సంఖ్య ఇటీవల 9 రెట్లు పెరిగిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ శక్తి, సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన అన్నారు.