రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురు గ్రామ్ లో ఓ ‘అవేర్ నెస్’ కార్యక్రమ ప్రచారం కోసం వస్తున్నారని తెలిసి పోలీసుల హడావుడి అంతా ఇంతా కాదు. జాతీయ రహదారిని 5 గంటలపాటు దాదాపు దిగ్బంధం చేస్తామంటూ అనేక ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో అనేక స్కూళ్ల సమయాలను యాజమాన్యాలు మార్చాల్సి వచ్చింది. ఇక తమ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ఇతర పనుల మీద తమ గమ్య స్థానాలకు వెళ్లే ప్రజల అవస్థలు ఇన్నీఅన్నీ కావు.
ఈ సమాచారం తెలిసిన రాష్ట్రపతి కార్యాలయం వెంటనే ఈ ఆంక్షలను సడలించాలని పోలీసులకు సూచించింది. దీంతో వారు కేవలం 5 నిముషాల పాటు మాత్రమే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ తమ ఉత్తర్వులను సవరించుకోవలసి వచ్చింది. నిజానికి రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల భద్రత కోసమంటూ ఇండియాలోని అనేక నగర్లో పోలీసుల భారీ బందోబస్తు చెప్పనలవి కాదు.
వారు ప్రముఖులు వెళ్లే సదరు మార్గాల్లో గంటలకొద్దీ ట్రాఫిక్ ఆపేస్తారు. అత్యవసర పనులమీద వెళ్లేవారికి, విద్యార్థులకు కలిగే ఇబ్బందులను పట్టించుకునే నాథుడే లేకుండా పోతున్నారు. ఇలా సాధారణ ప్రజలు ఎన్ని తిప్పలు పడుతున్నారో పొలిటికల్ లీడర్లు, వీవీఐపీలు ఒక్కసారి ఆలోచించుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
ఇలాంటి పరిస్థితి కేవలం ఇండియాలోనే ఉందని, ఇతర దేశాల్లో లేదని వీరు పేర్కొంటున్నారు. చివరకు అమెరికా అధ్యక్షుడు కూడా తన పర్యటన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని తన సెక్యూరిటీని ఆదేశిస్తారట. ప్రజలకు పెద్దగా ఇబ్బంది లేకుండా స్థానిక పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తారని వారు గుర్తు చేశారు. ఇలా ఇంకా అనేక ఇతర దేశాల్లో ఉందన్నది వారి అభిప్రాయం. మరి అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో కూడా ఆయా దేశాల్లో మాదిరి ప్రజలను ఇబ్బంది పెట్టని వీఐపీల పర్యటనల కాలం ఎప్పుడొస్తుందో మరి అని వారు నిట్టూరుస్తున్నారు.