రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిన భారత్ గౌరవ్ పథకం కింద దేశంలోనే తొలి ప్రైవేట్ రైలును ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కోయంబత్తూరు నార్త్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు అధికారులు. ఈ రైలు కోయంబత్తూర్ నార్త్ నుంచి సాయినగర్ షిర్డీ టూరిస్ట్ సర్క్యూట్ లో నడుస్తుందని దక్షిణ రైల్వే తెలిపింది.
5 రోజుల పాటు ప్యాకేజీ టూర్ కింద ఇందులో ప్రయాణించొచ్చని దక్షిణ రైల్వే తెలిపింది. 100 మంది ప్రయాణికులతో ‘దేఖో అప్నా దేశ్’ పేరిట మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్ లో బయలుదేరిన రైలు సాయినగర్ శిర్డీకి గురువారం ఉదయం 7.25 గంటలకు చేరుతుందని దక్షిణ రైల్వే వెల్లడించింది.
తిరుపూరు, ఈరోడ్, సేలం, ఎలహంక, ధర్మవరం, మంత్రాలయం రోడ్, వాడి మీదుగా వెళ్తుంది. కోయంబత్తూరు నుంచి వెళ్లేటప్పుడు మంత్రాలయం రోడ్ లో మంత్రాలయం ఆలయ సందర్శనార్థం 5 గంటల పాటు ఆగుతుందని దక్షిణ రైల్వే వెల్లడించింది.
తిరుగు ప్రయాణంలో సాయినగర్ శిర్డీలో 17వ తేదీ ఉదయం 7.25 గంటలకు బయలుదేరి కోయంబత్తూరు నార్త్ కు 18న మధ్యాహ్నం 12 గంటలకు చేరుతుందని రైల్వే శాఖ తెలిపింది. ఈ ట్రైన్ లో ఆధునిక హంగులతో బోగీలు, అందుబాటులో వైద్యుడు, రైల్వే పోలీసులతో పాటు ప్రైవేటు భద్రతా సిబ్బంది, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది ఉంటారని తెలిపింది.