లక్నో-ఢిల్లీ మధ్య తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీయడం ఆరంభించింది. దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన మొట్ట మొదటి రైలు ఇది. పాక్షిక అత్యధిక వేగం కలిగిన ఈ తొలి ప్రైవేటు రైలు ప్రస్తుతానికి లక్నో-ఢిల్లీ మార్గాల మధ్య నడుస్తుంది. వీలును బట్టి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. భారతదేశపు భవిష్యత్ రైలు ప్రయాణం అచ్చం ఇలాగే ఉంటుందని తెలిపే రైలు ఇదని ఇండియన్ రైల్వే సగర్వంగా ప్రకటించింది.
పబ్లిక్-ప్రయివేటు భాగస్వామ్యం.. అంటే పీపీపీ విధానంలో రైల్వేల అభివృద్ధి, కనెక్టివిటీని పెంచుతామని ఇటీవల బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ రంగం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన సేవలు, వేగవంతమైన రవాణా వంటి ప్రాజెక్టులు చేపడతామని సీతమ్మ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. రైల్వేల అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో 50 లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని, అది ప్రభుత్వంతో సాధ్యమయ్యే పని కాదని అభిప్రాయపడ్డారు. ఇందులోభాగంగా రైల్వేల విస్తరణ, అభివృద్ధికి పీపీపీ భాగస్వామ్యం తప్పనిసరి అన్నారు.
సీతారామన్ ప్రకటన దరిమిలా రైల్వే సర్వీసుల నిర్వహణలో తొలిసారి ప్రయివేటు రంగం కాలుమోపింది. టెండర్ ప్రక్రియతో దీనిని అప్పగిస్తారు. ఢిల్లీ-లక్నో మార్గం ఇందుకు ప్రయోగాత్మక వేదికగా నిలిచింది. ఈ రూటులో తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించారు. 2016లో ఢిల్లీ-లక్నో మార్గంలో తేజాస్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించారు. కానీ ఇన్నాళ్టికి ఇది సాకారం అయ్యిది.రానున్న 100 రోజుల్లో 2 రైళ్లను ప్రయివేటుకు అప్పగించనున్నారు. అందులో తేజాస్ మొదటిది.
ఈ ప్రైవేట్ రైలు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు..
ఇండియన్ రైల్వే ఈ మొదటి తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును లక్నో-ఢిల్లీ రూటులో ప్రవేశపెట్టింది. తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ప్రతి సీటుకు ఎల్‌సిడి డిస్‌ప్లేలను అమర్చారు. మొదటగా వీటిని ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అందుబాటులోకి తెచ్చారు, తరువాత కాలంలో వీటి ద్వారా ప్రయాణికులకు ప్రయాణ సమాచారాన్ని అందివ్వనున్నారు.
తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్ట వేగం గంటకు 130 కిలోమీటర్లుగా ఉంది. రైలు భోగీలకు అందించిన పెయింట్ స్కీమ్‌కు సరిపోలే ఇంటీరియర్ పెయింటింగ్ చేశారు. సౌకర్యవంతమైన విమానంలోని ఫీచర్లను పోలి ఉండే తేజాస్ రైలులో ఉచిత వై-ఫై సదుపాయం కూడా ఉంది.
ఇండియన్ రైల్వేలో ఆటోమేటిక్ ఓపెన్, క్లోజ్ సిస్టమ్ గల డోర్లను కలిగిన మొదటి రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్. రెండు భోగీలను అనుసంధానం చేయడానికి ఉన్న నిర్మాణాన్ని గ్యాంగ్ వే అంటారు. ఇండియన్ రైల్వేలో పటిష్టమైన గ్యాంగ్‌వే గల మొదటి రైలు తేజాస్ ఎక్స్‌ప్రెస్.
రాజధాని,శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో క్యాటరింగ్ సర్వీసు వుంది. టికెట్ ధరలు ఇంచుమించు సేమ్ టు సేమ్. ఎంచుకోదగ్గ వంటకాలను అనుభవజ్ఞులైన వంటమనుషులు వండుతారు.
తేజాస్ ఎక్స్‌ప్రెస్ రైలులో టీ, కాఫీ మిషన్ సర్వీసులు ఉన్నాయి. సిటింగ్ దగ్గర మ్యాగజీన్స్ , స్నాక్ టేబుళ్లను కూడా అందిస్తారు. అన్ని భోగీలలో అందుల కోసం బ్రెయిలీ డిస్‌ప్లేలను, గమ్యస్థానాలను తెలిపే బోర్డులను, ఎలక్ట్రానిక్ ప్యాసింజర్ రిజర్వేషన్ చార్టులను వుంచారు.
బయో వాక్యూమ్ టాయిలెట్ల కోసం నీటి మట్టం తెలిపే ఇండికేటర్లు, సెన్సార్ల ద్వారా పనిచేసే ట్యాపులు, చేతి తడిని ఆరబెట్టే హ్యాండ్ డ్రైయ్యర్లు తేజాస్ రైలులో ఉన్నాయి.
ఇండియన్ రైల్వేలోని మరే ఇతర రైలులో లేని విధంగా ఇందులో అత్యాధునిక మంటలను గుర్తించి, ప్రతిస్పందించే వ్యవస్థలను అమర్చారు. ఈ రైలులో మంటలు గుర్తించినట్లయితే ఆటోమేటిక్‌గా బ్రేకులు ప్రెస్ చేసి రైలును ఆపివేసే విధంగా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.