రైళ్లలో ప్రయాణీకులకు సీట్లు రిజర్వ్ చేయడమే ఇప్పటి వరకు చూశాం. కానీ దేవుళ్లకు కూడా సీట్లు రిజర్వ్ చేసి సరి కొత్త సాంప్రదాయానికి ఇండియన్ రైల్వే శాఖ తెర తీసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కాశీ-మహాకాల్ ఎక్స్ ప్రెస్ లో ఓ సీటును ”శివుని” పేరు మీద రిజర్వ్ చేశారు. కాశీ-మహాకల్ ఎక్స్ ప్రెస్ రైలు రెండు రాష్ట్రాల్లోని మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ ప్రయాణీస్తుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో ఉన్న ఓంకారేశ్వర్, ఉజ్జయిని లోని మహాకాలేశ్వర్ గుండా ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కు చేరుతుంది. వచ్చే గురువారం నుంచి ఈ రైలు సేవలు ప్రారంభమవుతాయి. వారానికి మూడు సార్లు తిరిగే ఈ ఎయిర్ కండిషన్డ్ రైల్లో భక్తి సంగీతం, పూర్తిగా శాకాహార భోజనం సప్లై చేయాలని నిర్ణయించారు.
ఈ రైల్లోని కోచ్-బి5 లో సీటు నెంబర్ 64 ను దేవుని కోసం రిజర్వ్ చేశారు. ట్రెయిన్ బయలు దేరడానికి ముందు రైల్వే సిబ్బంది దేవునికి పూజ చేసుకోవడానికి దాన్ని ఖాళీగా ఉంచినట్టు రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. దేవుని పేరు మీద సీటు రిజర్వ్ చేయడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. అయితే తన విమర్శలో ఎక్కడా ఒక్క పదాన్ని కూడా వాడలేదు. రాజ్యాంగం పీఠిక, ప్రధాన మంత్రి కార్యాలయం ఫోటోను మాత్రమే పెట్టారు.