టూరిజాన్ని ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ వినూత్న ఆలోచన చేస్తోంది. తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈక్రమంలో రైలు బోగీలను లీజుకిచ్చేందుకు యోచిస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా రైలు బోగీలను లీజుకు తీసుకొని.. వాటిని పర్యాటకాన్ని ప్రోత్సహించేలా వినియోగించుకోవచ్చు. తమకు ఇష్టమైన విధంగా వాటిని వినియోగించుకోవచ్చు. ప్రయోగాత్మకంగా ఇప్పటికే చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాన్నివ్వడంతో పాటు, ఆదాయాన్ని కూడా పెంచడంతో మరింత విస్తరించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది.
ఇటీవల ఇదే విషయమై ఓ సమావేశం నిర్వహించగా.. గురుద్వారా సర్క్యూట్’ లో అలాంటి రైళ్లను నడపడానికి చాలా మంది ప్రైవేట్ వ్యక్తులు ఆసక్తి చూపించారు. అమృత్‌సర్‌లోని హర్మిందర్ సాహిబ్, ఢిల్లీలోని గురుద్వారా దమ్‌దమా సాహిబ్, నాందేడ్‌లో గురుద్వారా హుజూర్ సాహిబ్, పాట్నాలోని గురుద్వారా పాట్నా సాహిబ్ మధ్య అలాంటి బోగీలను తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. కోచ్‌ల లీజు పరిమితి ఐదేళ్ల వరకు ఉంటుంది. రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం లీజుకు తీసుకొనే వారికే ఉంటుంది.