కరోనా లాక్ డౌన్ కారణంగా రైల్వే వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. లాక్ డౌన్ సమయంలో మొదలుపెట్టిన శ్రామిక్ రైళ్లతో పాటు క్రమంగా కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రారంభించింది. ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా అవి ఏ మూలకు చాలటం లేదు. మరిన్ని ట్రైన్స్ నడిపేందుకు రైల్వే శాఖ రెడీగా ఉన్నా, కేంద్ర హోంశాఖ అనుమతి కోసం వేచి చూస్తుంది.
కేంద్రం ఇప్పటికే ప్రకటించిన అన్ లాక్ 4.0 సడలింపుల్లో మెట్రో రైళ్లకు అనుమతిచ్చింది. దీంతో రైల్వేకు కూడా మరికొన్ని సర్వీసులను నడిపేందుకు షెడ్యూల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే శాఖ తాజాగా పెట్టిన మరో 100రైళ్ల ప్రతిపాదనపై హోంశాఖ కూడా సుముఖంగా ఉందన్న ప్రచారం సాగుతుంది.
కొత్తగా ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న 100 ప్రత్యేక రైళ్లలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిచే లోకల్ రైళ్లతో పాటు ఇతర రాష్ట్రాల మధ్య నడిచే సర్వీసులు కూడా ఉండబోతున్నట్లు ప్రచారం సాగుతుంది. లాక్ డౌన్ ను కేంద్రం దాదాపుగా ఎత్తివేస్తూ, రాష్ట్రాల మధ్య కూడా ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదని స్పష్టం చేసిన నేపథ్యంలో… దేశంలో కీలక రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేను పట్టాలెక్కించటం ద్వారా ఆర్థిక వ్యవస్థను కాస్తయిన గాడిలో పెట్టవచ్చన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతుంది.