భారతీయ సంస్థకు ఓ విదేశీ అపూర్వ పురస్కారం లభించింది. దాని పేరే ‘ఖేతీ’ ! ఈ సంస్థ అనుసరిస్తున్న ‘గ్రీన్ హౌస్ ఇన్ ఏ బాక్స్’ విధానానికి గాను తాము ఎర్త్ షాట్ పేరిట ప్రైజును ఇస్తున్నట్టు బ్రిటన్ ప్రిన్స్ విలియం ప్రకటించారు. సన్నకారు గ్రామీణ రైతుల వ్యవసాయ ఖర్చులను తగ్గించు కుని .. వారి దిగుబడులను పెంచే దిశగా .. కప్పగంతుల కౌశిక్ అనే నిపుణుడు ఈ స్టార్టప్ ని ఏర్పాటు చేశారు. ఆయనకు అంతర్జాతీయ ‘ఎర్త్ షాట్ ప్రైజ్ ‘ ని ప్రకటించారు. బ్రిటన్ ప్రిన్స్ విలియం ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద 10 లక్షల పౌండ్ల నగదు బహుమతితో ఆయన విన్నర్ అయ్యారు.
ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతూ ఈ భూగ్రహాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ‘ప్రొటెక్ట్ అండ్ రెస్టోర్ నేచర్’ కేటగిరీలో ఆయనకు ఈ పురస్కారం లభించింది. ముఖ్యంగా చిన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్క్రారానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. క్లైమేట్ ఛేంజ్ ఓ సమస్యగా మరి సంక్షోభంగా మారగా దీనికి సంబంధించి పరిష్కార మార్గాలను ఇది సూచిస్తుందని ‘ఎర్త్ షాట్’వెబ్ సైట్ తెలిపింది. ఎర్త్ షాట్ అవార్డును అందుకున్న అయిదుగురు విజేతల్లో కౌశిక్ ఒకరు. బోస్టన్ లో శుక్రవారం నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్.. ఈ భూగ్రహం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించగలుగుతామని నిరూపణ అయిందన్నారు. 2030 వరకు ప్రతి సంవత్సరం ఎర్త్ షాట్ అవార్డులను తాము అందిస్తామన్నారు. గ్రీన్ హౌస్ కింద ఈ స్టార్టప్ .. రైతులు తమ దిగుబడులను పెంచుకునేలా వారికి శిక్షణనిస్తుంది. వారికి సాయపడుతుంది. ప్రస్తుతం దాదాపు వెయ్యిమంది రైతులకు గ్రీన్ హౌస్ ‘సౌకర్యం’ ఉంది.
నిజానికి ఎర్త్ షాట్ అవార్డును ‘పర్యావరణ (ఎకో) ఆస్కార్’ గా అభివర్ణిస్తున్నారు. తెలంగాణాలో ఏర్పాటైన అంకుర సంస్థ ఇది. ‘ఖేతీ’ కో-ఫౌండర్, సీఈఓ కూడా అయిన కౌశిక్ మాట్లాడుతూ.. తాము అనుసరిస్తున్న గ్రీన్ హౌస్ పద్ధతిలో రసాయనాల వాడకం తక్కువగా ఉంటుందని, పంటకు నీటి అవసరం 98 శాతం తగ్గుతుందని చెప్పారు. దిగుబడి కూడా ఏడు రెట్లు అధికంగా వస్తుందన్నారు. రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు.
1960 ప్రాంతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ ప్రారంభించిన ‘మూన్ షాట్ ఛాలెంజ్’ ని స్ఫర్తిగా తీసుకుని ‘ఎర్త్ షాట్’ అవార్డును ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఆదివారం బీబీసీలో ప్రసారం చేస్తున్నారు. ఈ అవార్డు కోసం ప్రపంచవ్యాప్తంగా వందలాది ఎంట్రీలు వచ్చాయి. ఇండియాలో సుమారు 10 కోట్లమంది సన్న, చిన్నకారు రైతులున్నారని, తన గ్రీన్ హౌస్-ఇన్ ఏ బాక్స్ విధానం కింద ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఈ స్టార్టప్ ని ఏర్పాటు చేశానన్నారు. ఈ ఏడాది ఎర్త్ షాట్ అవార్డు రావడం తమకు గర్వకారణమని, ఈ ప్రపంచంలో అనేకమంది సన్న, చిన్న రైతులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారని ఆయన చెప్పారు. ఇక ఎర్త్ షాట్ అవార్డులను పొందినవారిలో కెన్యా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఒమన్ దేశాలకు చెందిన నిపుణులు ఉన్నారు.