23 ఏళ్ళ లోపున్న భారతీయ రెజ్లర్లకు స్పెయిన్ ఎంబసీ వీసాలు నిరాకరించింది. ఈ నెల 17 నుంచి ప్రారంభమై 23 వరకు స్పెయిన్ లోని ‘పొంటేవెద్ర’ నగరంలో అండర్-23 రెజ్లర్లకు వాల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరగనున్నాయి. అయితే ఈ ఇండియన్ రెజ్లర్లకు వీసాలు మంజూరు చేస్తే వారు తమ వీసా కాల పరిమితికి మించి ఈ నగరంలో ఉండవచ్చునన్న సందేహాలు తలెత్తాయని స్పెయిన్ అధికారులు చెబుతున్నారు. వాల్డ్ రెజ్లింగ్ చరిత్రలో ఇండియన్ కుర్రాళ్లకు ఇలా జరగడం ఇదే మొట్టమొదటి సారి.
గత ఏడాది బెల్ గ్రేడ్ లో జరిగిన వాల్డ్ క్లాస్ ఫీల్డ్ లో భారతీయ కుర్రాళ్ళు మెరిశారు. మహిళల 50 కేజీల కేటగిరీలో శివానీ పవర్ రజత పతకం సాధించింది. ఆ పోటీల్లో ఈమెతో బాటు అయిదుగురు పతకాలు సాధించారు. ఇక స్పెయిన్ లో జరగనున్న పోటీలకు 45 మంది సభ్యులతో ఇండియన్ జట్టును ఎంపిక చేశారు. వీరిలో 30 మంది రెజ్లర్లు కూడా ఉన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆప్ ఇండియా సెలెక్ట్ చేసిన ఈ జట్టులో 53 కేజీల కేటగిరీలో రెజ్లర్ అంతిమ్ పంఘాల్ వంటివారున్నారు. అలాగే పురుషుల 74 కేజీల విభాగంలో వాల్డ్ కేడెట్ చాంపియన్ సాగర్ జగ్లాన్, రజత పతక విజేత రీతికా హుడా జూనియర్ వాల్డ్ సిల్వర్ మెడలిస్ట్ భాతేరీ లాంటి మెరికలున్నారు.
వీసా కోసం వీరందరి దరఖాస్తులను ఈ నెల 4 నే ఎంబసీకి సమర్పిచినట్టు వాల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ తెలిపారు. నార్మల్ కేటగిరీలోనే వీరి అప్లికేషన్లు ఉన్నాయని, ఈ నెల 16 న వీరు ఇండియా నుంచి బయలుదేరేలా విమాన టికెట్లు కూడా బుక్ చేశామని ఆయన చెప్పారు. కానీ 9 మందికి తప్ప ఇతరుల వీసా దరఖాస్తులను తిరస్కరించినట్టు ఎంబసీ తెలిపిందని ఆయన వెల్లడించారు. ఈ తొమ్మిది మందీ అప్పుడే స్పెయిన్ కి బయల్దేరి వెళ్లారు. ఈ రెజ్లర్లలో అంతిమ్ పంఘాల్ వీసా దరఖాస్తును కూడా తిరస్కరించారు. ఇలా అయితే భవిష్యత్తులో ఆ దేశంలో జరిగే రెజ్లింగ్ పోటీలకు మన జట్టును పంపేది లేదని వినోద్ తోమర్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు.