మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు.. అంటే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి.. అని అర్థం. అయితే వారి వివాహం మాత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్ణయించబడింది. ఏంటీ.. ఆశ్చర్యపోతున్నారా.. ఏమీ లేదండీ.. ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)లో ఆదివారం రెండో వన్డే మ్యాచ్ జరిగింది కదా. ఆ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ యువకుడు ఆస్ట్రేలియన్ యువతికి పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఆమె యెస్ అని చెప్పడంతో స్టేడియం అంతటా హర్షధ్వానాలు నెలకొన్నాయి.
ఇండియా ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్‌లు లక్ష్య ఛేదనలో బిజీగా ఉన్నారు. అదే సమయంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఓ భారతీయ యువకుడు పక్కనే ఉన్న తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. అయితే మ్యాచ్ సందర్భంగా మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్లు షేన్ వార్న్, ఆడం గిల్ క్రిస్ట్‌లు క్రికెట్ కామెంటరీకి బదులుగా ఆ ఇద్దరికి సంబంధించిన కామెంటరీ చెప్పారు. యెస్ అని చెప్పు, సే యెస్.. అంటూ కామెంట్రీ చేశారు. ఈ క్రమంలో ఆ యువతి అతనికి యెస్ అని చెప్పింది. దీంతో ఆ మాజీలు వారికి కంగ్రాట్స్ చెప్పారు. ఇక మైదానంలో ఉన్న ఆస్ట్రేలియన్ ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ కూడా చప్పట్లతో వారికి కంగ్రాట్స్ చెప్పాడు. షి సెయిడ్ యెస్ (ఆమె యెస్ అని చెప్పింది) అనే అక్షరాలు స్టేడియంలోని తెరలపై ప్రత్యక్షమయ్యాయి. దీంతో స్టేడియం అంతటా సందడి నెలకొంది. అందరూ ఆ యువ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Was this the riskiest play of the night? 💍
She said yes – and that's got @GMaxi_32's approval! 👏 #AUSvIND pic.twitter.com/7vM8jyJ305
— cricket.com.au (@cricketcomau) November 29, 2020
అయితే ఆ మ్యాచ్‌లో భారత్ మళ్లీ ఓడిపోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ 64 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ చేసి ఆకట్టుకోగా, ఇతర ప్లేయర్లు కూడా రాణించారు. దీంతో ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 389 పరుగుల భారీ స్కోరు చేసింది. కానీ చేజింగ్ లో తడబడ్డ భారత్ మళ్లీ ఓడింది. దీంతో సిరీస్ కోల్పోయింది. కానీ మ్యాచ్ లో అలా ఆ జంట ప్రపోజ్ చేసుకున్నసంఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా వారిని అభినందిస్తున్నారు. తాము మ్యాచ్ చూద్దామని వస్తే ఇంకో మ్యాచ్ ఫిక్స్ అయింది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.