వర్క్ పర్మిట్స్ గడువు ముగిసిన 2వేల మంది భారతీయులు ఒమన్‌ను విడిచి పెట్టి వెళ్లేందుకు తమ పేరు నమోదు చేసుకున్నట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఒమన్ సర్కార్ తీసుకువచ్చిన ఎగ్జిట్ స్కీంలో భాగంగా ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించింది.
దీంతో దాదాపు 2వేల మంది ఎగ్జిట్ స్కీంలో తమ పేరును ప్రవాస భారతీయులు రిజిస్టర్ చేసుకున్నట్లు ఇండియన్ రాయబారి మును మహావర్ సోమవారం వెల్లడించారు. దీంతో చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ లేని సుమారు 500 మందికి ఎంబసీ అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేసినట్లు తెలిపింది.
వర్క్ పర్మిట్ గడువు ముగిసిన ప్రవాసులు ఉంటే ఒమన్ ప్రభుత్వం దేశం విడిచి పెట్టి వెళ్లేందుకు విధించిన డెడ్‌లైన్ డిసెంబర్ 31 కంటే ముందే తమ పేరు నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం పేర్కొంది. అలాంటి వారి కోసం ఎంబసీ ప్రాంగణంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎలాంటి జరిమానాలు లేకుండా స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించింది.