రష్యా ఉక్రెయిన్ ల మధ్య బోర్డర్ సమస్యలతో యుద్ద వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది.
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. ఈ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఉదయం 200 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మూడు విమానాల్లో వీరిని భారత్ కు తరలించారు. గురు, శనివారాల్లో మరో రెండు విమానాలు ఉక్రెయిన్ కు వెళ్లనున్నట్టు అధికారులు వెల్లడించారు.
యుద్ద భయం నేపథ్యంలో విమానయాన సంస్థలు భారీ ఎత్తున టికెట్ ధరలు పెంచాయి. దీంతో తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి సమయంలో టికెట్ల ధరలు పెంచడం సరికాదని విద్యార్థులు పేర్కొన్నారు. తమని స్వదేశానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చర్చలు చేపట్టాలని వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం.. వీలైనంత తొందరగా ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు కావలసిన చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించింది.